Saturday, December 6, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 74(శ్రీ దత్త గురువు - శ్రీ సాయి గురువు )

 ఓం శ్రీ అనంతరూపాయ నమో నమ:

 శ్లో" అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:!
     స్మర్తృగామీ స్వభాక్తానాముద్ధర్తా భవసంకటాత్ !!


 రేపు అనగా 06-12-2014 శనివారం శ్రీ దత్తజయంతి సందర్భంగా ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి "శ్రీగురుచరిత్ర"నుండి దత్తగురువుకు,సాయిగురువుకుగల సన్నిహిత పోలికలు...సారాంశము.

   శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీగురుచరిత్ర" పారాయణ యెంతో అవసరం. హరివినాయక్ సాఠె, అన్నాసాహెబ్ దభోల్కర్ వంటి వారికి శ్రీసాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి "శ్రీగురుచరిత్ర" పారాయణమే కారణమైంది.కుశాభావు అనే భక్తుడి విషయంలో యీ సత్యం యింకెంతో స్పష్ఠంగా కనిపిస్తుంది. అతడిచేత యీ గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాధుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది.ఆయన మహాత్ములందలోకి తలమానికము.తాను సద్గురువునని చెప్పక, అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో యెన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు యెన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో యీ విషయం వివరించారు. అంటే భక్తులు యెలా శ్రీసాయిని సేవించాలో "శ్రీగురుచరిత్ర" నుండి నేర్చుకోమని శ్రీసాయి సూచించారన్నమాట.

   అంతేగాక, శ్రీగురునికి-సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు యెన్నో ఉన్నాయి. జన్మించిన క్షణమునుండే యీ యిద్దరికీ తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే.అయినప్పటికీ సత్సాంప్రదాయాన్ననుసరించి ఇద్దరూ బాహ్యంగా గూడ ఒకగురువును ఆశ్రయించారు.  శ్రీగురుడు శ్రీశైలములో అంతర్ధానమయినప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణపదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్దికాలానికే ఆయన గూడా శరీర త్యాగం చేసారు.  ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి  తలక్రిందులుగా వ్రేలాడదీసినట్లు చెప్పారు. గురుచరిత్రలో దీపకుడు,ఉపమన్యువు మొ"న వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు.   శ్రీగురుడు యెంతోకాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశసంచారం చేస్తూ లోకుల దృష్టినుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సం"లు తపోనిష్ఠలో ఉన్నారు.    శ్రీసాయి గూడా శిరిడీలో వేపచెట్టుక్రిందనున్న భూగృహంలో 12 సం"లు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక గూడ సుమారు 30 సం"లు గుప్తంగా పిచ్చి ఫకీరువలె జీవించారు.  శ్రీగురుడు తాము లోకానికి వెళ్ళడి కావలిసిన సమయమొచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమయినట్లు, శ్రీ సాయి గూడ చివరి 23 సం"లలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి గనుక, యావజ్జీవితమూ తమ గురుసన్నిధిలోనే ఉండిపోయారు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళిరావడం నిత్యమూ మహోత్సవంగా జరిగినట్లే, శ్రీసాయి రోజూ లెండీకి రావడం,రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడమూ గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే ,సాయిచరిత్రలో గురుస్థానం (వేపచెట్టు మూలం) నర్సోబావాడి వంటిది.; లెండీవనమే సంగమం;ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ యేటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిననుగ్రహించి,వారికి బిరుదులు గూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకనికి 'యోగీశ్వర్ 'అని మరొకరికి 'కవీశ్వర్ ' అని బిరుదులిస్తే-శ్రీసాయి ఒకరికి 'దాసగణు ' అని, మరొకరికి 'హేమాడ్పంత్ 'అని బిరుదులివ్వడమే కాక, జోగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి 'సగుణోపాసన ' వ్రాయించుకున్నారు.  శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతనినుండి పూజలందుకున్నారు. సాయి యవనులందరిచేత సేవించ బడుతున్నారు.ఇద్దరిదీ భిక్షావృత్తియే. ఈ ఇద్దరూ కర్మఫలానికీ, జన్మ పరంపరలకూ యెంతో ప్రాముఖ్యమిచ్చారు. ఇలా ఆలోచించినకొద్దీ యింకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే "శ్రీసాయిబాబా జీవితచరిత్ర","శ్రీగురుచరిత్ర" ..ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ, "శ్రీసాయిబాబా జీవిత చరిత్ర","శ్రీగురుచరిత్ర","శ్రీగురుగీత"లు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయము అంటే సనాతనధర్మమంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు,భగవద్గీత.


  సర్వజీవులనూ ఉద్ధరించడమే తమ అవతారకార్యంగా గల దత్తాత్రేయుణ్ణి భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకుంటూ,త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుణ్ణే మనసారా స్మరిస్తున్నారు.

ఓం దత్త... శ్రీ దత్త...జయగురుదత్త  

   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



Friday, November 14, 2014 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73

ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ:

" సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగామి, ప్రారబ్ధకర్మములలో ప్రారబ్ధం భోగముతో, జ్ఞానంచే సంచితము, మిత్రులు శత్రువుల పరుష మాటలచే ఆగామి నశించునని శాస్త్రం చెప్తున్దిలా -

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్ / 
ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్ద్వేషి ప్రియవాదినో: //

దీనినే సామాన్యులకు సైతం అర్ధమయ్యే ఘటనలు పారాయణంలో చదివాను - అని  బాబాగారి సచ్చరిత్ర లోని ప్రతి సంఘటన ఒక జ్ఞానబోధ. ప్రతి ఘటనను వివరముగా రాయమని ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషి, ప్రియస్నేహితురాలికి ధన్యవాదాలు తెలుపుతూ", బాబాగారు శ్యామాకు తెలిపిన ప్రారభ్దకర్మ గురించి ఇలా....

 ఒక భక్తుడు సాయిబాబాకి భక్తితో 2రూ"ల దక్షిణ ,సాయి పేరుమీద శిరిడీకి పంపాడు. ఆ సమయములో సాయి మశీదులో లేరు. ఆ రెండు రూపాయలను శ్యామా తీసుకొని సంతకం చేసాడు. శ్యామాకు బాబాగారిని పరీక్షించాలని వారి సర్వజ్ఞత, శక్తి స్వయంగా చూడాలని,వాటిని సాయికి ఇవ్వకుండా, మశీదులో ఒక మూలకు పాతిపెట్టాడు. సాయి మశీదుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. కొన్నాళ్ళకు ,శ్యామా ఇంట్లో దొంగలు పడి 200రూ"లు దొంగిలించారు. శ్యామా బాధపడి, తనకు జరిగిన దుస్థితిని సాయితో చెప్పుకున్నాడు.  అపుడు సాయి నవ్వుతూ,  "నీకు చెప్పుకోడానికి నేనైనా వున్నాను. నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది. మరి నేనెవరితో చెప్పుకోవాలి." అని శ్యామావైపు సాయి గంభీరంగా చూసాడు. 

శ్యామా రెండు రూపాయలు దాచిపెట్టిన సంగతి సాయి తెలుసుకున్నారని సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి బాబా! ఏదో తమాషాకొద్దీ, నేను 2రూ"లు దాచిపెడితే, నాకు 200రూ"ల నష్టం కలిగిస్తావా? ఇదేమి న్యాయం అని శ్యామా అన్నాడు.

  "ఎందుకు దిగాలు పడతావు, ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. మనచేతనిబట్టే ప్రారబ్ధమనే తలవ్రాత వుంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు" అని   ఉద్యోగం చేసే నీకు 200రూ"లు ఎంతో, ఏ ఉద్యోగం లేని ఈ ఫకీరుకు 2రూ"లు అంతే. అని శ్రీసాయి చెప్పడముతో ధర్మ సూక్ష్మానికి శ్యామా అశ్చర్యపడ్దాడు. బాబా హితబోధ వలన ప్రారబ్ధం అన్నది అనుభవించక తప్పదని, అది అనుభవిస్తే పోతుందని,   తెలుసుకొని తిరుగులేని విశ్వాసాన్ని సాయి మీద నిలుపుకున్నాడు.

  శ్యామాద్వారా మనకు 3 విషయాలు బోధపడ్డాయి. అవి "1. గురువును పరీక్షించరాదు. 2. గురువు విషయంలో తప్పు చేస్తే, ఎప్పుడో ఒకనాడు శిక్ష అనుభవించక తప్పదు. 3. గురువుకు చేసే మంచైనా, చెడైనా శిష్యునికి 100 రెట్లు తిరిగి వస్తుంది " 

ఇక్కడ నా ప్రారబ్ధ ఘటన గురించి కూడా మీకు తెలియజేయాలి. దాదాపు ఐదు నెలల క్రితం నేను,మావారు మా వియ్యంకులవారి ఇంటికి వెళ్ళి వస్తుండగా, రాత్రి వర్షం పడి, చిన్న,చిన్న చినుకులు పడుతుండగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పరధ్యానంగా ఉన్న సమయంలో,బైక్ మీద ఒకవ్యక్తి మమ్మల్ని కంఫ్యూజన్ చేస్తూ మా ముందుకు వచ్చి నామీద లైట్ ఫోకస్ చేస్తూ నాకు తెలియకుండా పక్కకు వచ్చి నా మంగళసూత్రాలు, నల్లపూసలగొలుసు ఒక్క క్షణంలో లాక్కుని వెళ్ళిపోయాడు. నేను లాగేస్తున్నాడు అని అరుస్తుంటే మావారు పరిగెత్తి పట్టుకోబోయి పడిపోయారు. వర్షం వల్ల రోడ్డుపైన జారి పడిపోయారు. వాడు అప్పటికే పారిపోయాడు.నా అరుపులకి చుట్టుపక్క జనాలు వచ్చి నన్ను ఓదారుస్తుండగా అప్పటి వరకు వెలగని స్ట్రీట్ లైట్స్ అప్పుడు వెలిగాయి. ఐదు ని"లలో  పోలీసులు వచ్చారు. జరిగినది తెలుసుకున్నారు. మా వియ్యంకులవారు,మేము పోలిస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ రాసి సంతకంచేసి ఇచ్చి వచ్చాము. జరిగిన దానికి నా అజాగ్రత్తే కారణమని తలచినా, మంగళవారం నాడు పోయాయి అని చాలా బాధపడ్డాను. ఈ సంఘటన తెలిసిన సత్సంగ సభ్యులు ఇద్దరుమరియు స్నేహితులు మమ్ములను ఇలా అడిగారు. "మీరు రోజూ బాబాకి పూజలు చేస్తారుకదా! మరి మీకెందుకిలా జరిగింది?"మేము చెప్పాము..."మీ కర్మలకు నన్ను కారణభూతుణ్ణి చేయకండి. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే!" అని బాబాగారు చాలా సంధర్భాలలో చెప్పారు.మరి నేను చేసిన ఏ కర్మఫలమో అని అనుకున్నాను. కానీ బాబాగారికి విన్నవించుకున్నాను. ఎందుకిలా జరిగిందో తెలియదు. పరిష్కారం నీకే తెలుసు. నీ చరణాలు పట్టుకున్న మేము ఈ విషయాన్ని నీ పాదాలవద్ద వుంచాము అని. ఒక వారంలో  స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మీ గోల్డ్ దొరికింది. దొంగను పట్టుకున్నాము. కోర్టుకు వచ్చి మీ బంగారం తీసుకెళ్ళవచ్చు . అని చెప్పారు. మూడున్నర తులాలు పోతే, సగంకి కొంచం ఎక్కువ బంగారం ఇచ్చారు. అప్పుడు సత్సంగ సభ్యులు మీ భక్తి, పూజలవల్ల బాబాగారి అనుగ్రహం వల్ల మీకు పోయిన బంగారం దొరికింది అని అన్నారు.    ఎందుకు జరిగినా.. మమ్మల్ని సదా ఎరుకలో ఉండమని బాబాగారు హెచ్చరించినట్లు మాకు బోధపడింది.


  శివేరు ష్టే గురు: త్రాతా గురౌ రుష్టే న కశ్చ న !



శివుడు కోపించిన గురువు మనలను రక్షించును. గురువు కోపించిన రక్షించువాడు మరొకడు లేడని పరమేశ్వరుడు తెలిపెను.

  ఇద్దరువ్యక్తులవాక్కలహంతో ఆగామి నశించే విధం ...ఘటనలు సవివరముగా తదుపరి.....



సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Wednesday, November 5, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 72

 ఓం  శ్రీ సాయికృష్ణాయ నమో నమ:


"నిరంతర సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవచ్చింతన మనస్సును ఆక్రమిస్తుంది. అప్పుడు అవసానకాలంలో సైతం మనస్సులో అదే మెదలుతూ ఉంటుంది."- శ్రీరామకృష్ణులు.



శ్రీ సాయికృష్ణుడు నానాకు చేసిన జ్ఞానబోధ :


శ్లో" తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా!


   ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శిన:!!

 ఇది గీతలోని మూల శ్లోకం. మొదటి రెండు చరణాల్లోని అర్ధాన్ని నానా వివరించి చెప్పింది బాబాగారు అంగీకరించారు. మిగిలిన రెండు చరణాల గురించి బాబాగారు ఎలా వివరించారో వినండి. 

 "నానా! శ్లోకంలోని మూడవ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అవగ్రహం ('అ ' ని లోపించినట్లు చూపించే 2చిహ్నం )పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్ధం చెప్పు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్నచోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్ధం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్నెలా ఉపదేశించగలం? కనుక జ్ఞానం అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానం అనే మాటకి అర్ధాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్ధం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగల్గితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకొని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా,లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు.కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశించబడ్తుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్చాదించబడిన శుద్ధజలంలా ఉంటుందది. ఈ నాచుని తెలివిగలవారు పక్కకు నెట్టుతారు. వారికే ఆ శుద్ధజలం లభిస్తుంది. చంద్రుడికీ, సూర్యుడికీ గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు, సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహు,కేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకొంటారు. చంద్రుడిపై, సూర్యుడిపై వీరి ప్రభావముండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయంసిద్ధంగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానం. దానిపై నున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్చాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, చూడగల శక్తిని ప్రకటం చేయాలి.

ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందడానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం అజ్ఞానమే సంసారంలోని దు:ఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయా ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలిఉంటుంది. దేవుడు, భక్తుడు వేరు అనుకోవడమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణజ్ఞానం మిగులుతుంది.దేహం జన్మించడానికి కారణం మాయ. దేహచలన వలనాలు, వర్తన,విధిననుసరించి ఉంటాయి. సమస్త (సుఖదు:ఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు ఇత్యాదులు) ద్వంద్వాలు కూడా విధి ననుసరించి ఉంటాయి. మన శరీరంపట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. కనుక మాయను నిరశించటానికి ఈశ్వరభజన అనేది ఒక్కటే ఉపాయం. మాయను దాటి   వెళ్ళడానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసారభయం వెంఠనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చేమరణం వస్తే రానీ. కానీ హరి విస్మరణని మాత్రం రానీకు.మనసులో హరి చరణాలను ధ్యానం చేయాలి.జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం మిగులుతుంది. అంత:కరణలో హరి,గురువుల చింతన కలగాలి.చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో నిరంతరం వారిని ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి,గురు గ్రామాలకు వెళ్ళాలి.నాసికతో వాళ్ళ నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి.అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి,గురువుల వైపు ప్రేమతో మళ్ళించిన ఆ భక్తుల స్థితి ధన్యం.  ఇంతకుమించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? 

సారాంశం - అజ్ఞానాన్ని సమూలంగా పెకలించివేయాలి. మిగిలినదే స్వయంసిద్ధజ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. 

శ్రీసాయిబాబా ప్రేమ,కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాని నిమిత్తంగా చేసుకొని మనందరికోసం గీతార్ధాన్ని ప్రవచనం చేసారు. 

 బాబాగారి జ్ఞానబోధను వినగానే నానాసాహెబ్ వినయవిధేతలతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో "బాబా నా తీవ్రమైన  అజ్ఞానాన్ని దూరం చేయండి. నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపజేయండి.నాపై కృపాదృష్టి చూపండి.ఇదే నాకు సుఖసంతృప్తులనిస్తుంది" అని ప్రార్ధించాడు. బాబాగారు ప్రేమ,కరుణలతో నానాను ఆశీర్వదించారు.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

      









Friday, October 10, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 71

శ్రీసాయినాధునితో నాలుగు జన్మల స౦బ౦ధాన్ని కలిగిఉన్న పుణ్యాత్ముడు నానా చ౦దోర్కర్.
శ్రీ సాయిని ఎన్నో ఆధ్యాత్మిక స౦దేహాలు ప్రశ్ని౦చి ,స౦దేహ నివృత్తి చేసుకున్న భక్త శిఖామణి నానా చ౦దోర్కర్.
శ్రీ సాయి ద్వారా రహస్య ఉపదేశాలు, బ్రహ్మోపదేశ౦ పొ౦దిన ధన్య శిష్యుడు నానా చ౦దోర్కర్.
1860 స౦”లో మకర స౦క్రా౦తి పర్వదినాన ము౦బయిలోని, కళ్యాణపురములో బ్రాహ్మణకుటు౦బమున గోవి౦ద్ చ౦దోర్కర్ కు ’నానా’ జన్మి౦చారు. నానా పూర్తి పేరు నారాయణ గోవి౦ద్ చ౦దోర్కర్.

నానా చ౦దోర్కర్ పట్టుదల గల వ్యక్తిత్వ౦ గలవాడు.స౦స్కృతమ౦టే ప్రీతి వలన నానా స౦స్కృతములో గొప్ప పా౦డిత్యాన్ని స౦పాది౦చాడు. శ్రీ సాయి కీర్తిని వ్యాపి౦పజేయుటలో నానా కీలకపాత్ర వహి౦చారు.

 నానాను సాయియే స్వయ౦గా పిలిపి౦చుకొని , ’గురువు శాశ్వత తోడు’ అని నిరూపి౦చారు.

  నానా, సాయిని కలిసిన కొన్ని నెలలకు , అహ్మద్ నగర్ లో ప్లేగు వ్యాధి వ్యాపి౦చి౦ది. ప్రజలకు టీకాలు వేయి౦చమని డిప్యూటీ కలెక్టరు అయిన నానాను, కలెక్టరు ఆదేశి౦చెను. టీకాలు వేయి౦చుకు౦టే జ్వర౦ తగిలి, చనిపోయే ప్రమాద౦ ఉన్నదని, ప్రజలు భావి౦చి, భయపడి ఎవ్వరూ ము౦దుకు  రాలేదు.
ఈ విషయ౦ తెలిసిన కలెక్టరు ప్రభుత్వ ఉద్యోగులైన మీర౦తా టీకాలు వేయి౦చుకో౦డి. మీకు ఏమీ కాలేదని ప్రజలు నమ్ముతారు. మిమ్ములను ఆదర్శ౦గా తీసుకుని వార౦తా భయపడకు౦డా ము౦దుకు వస్తారని సలహా ఇచ్చాడు.
నానా కూడా భయపడి, శ్రీ సాయి ఏ౦ చెబితే ,అది చేద్దామని షిర్డీకి వెళ్ళి, ఆవేదనతో సాయికి నమస్కరి౦చగానే,  
“నానా! ప్లేగు టీకాలు వేయి౦చుకో, నీకు జ్వర౦ రాదు. ప్రాణహాని జరుగదు అని  బాబా పలికెను.....

సాయి సిద్ధపురుషుడని, సమర్ధుడయిన యోగిఅని, గత జన్మల గురువని నానా పూర్ణ విశ్వాసముతో నమ్మాడు.                కానీ, సాయి ముస్లి౦ అని నానా భావి౦చాడు. ఒక ముస్లి౦ యోగిని గురువుగఆరాధిస్తున్నాడని,నియమానుసార౦ నడచుకొనే బ్రాహ్మణుడైన తన త౦డ్రి దీనిని ఖ౦డిస్తారని,అనుమతి౦చరని నానా భయపడ్డాడు. తన త౦డ్రిగారికి, శ్రీ సఖారా౦ మహారాజ్ అనే మహాత్ముడు గురువు. నా బాటలో నడవకు౦డా, హి౦దూ సా౦ప్రదాయానికి విరుద్ధ౦గా నడుస్తావాయని,నా త౦డ్రి కోప పడతారని నానా భయపడ్డాడు.

ఈ విషయాన్ని త౦డ్రితో ప్రస్తావిస్తే మహాత్ములలో సమర్ధతను,శక్తిని చూడాలే గాని వారి వేష-భాషలు, కులగోత్రాలు చూడరాదు. నీవు సమర్ధుడని విశ్వసిస్తే ,ముస్లీ౦ అని నీవు భావి౦చే సాయిని, నీవు కొలవడానికి –గురువుగా ఎన్నుకోవడానికి నాకు ఎలా౦టి అభ్య౦తర౦ లేదు.అని త౦డ్రి తెలిపెను.
 బాబాగారి తత్వబోధను తెలిసికొని,వారిని గురువుగా సేవిస్తూ, నానా ఒకరోజు  
బాబాగారి వద్ద కూర్చొని వారి కాళ్ళు వత్తుతూ నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను. 
బాబా : నానా! ఏమి గొణుగుచున్నావు?
నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను.
బాబా : ఏ శ్లోకము?
నానా : భగవద్గీతలోనిది.
బాబా : గట్టిగా చదువుము.
నానా : (భగవద్గీత 4.వ అధ్యాయము,34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.)

"తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
       ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శిన:" 

బాబా : నానా! అది నీకు బోధపడినదా?
నానా : అవును.
బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము.
 నానా : గురువుకు శుశ్రూషచేసి జ్ఞానవిచారణచేత, సాధనచేత జ్ఞాని అయినవాడు మాత్రమే ఇతరులకు జ్ఞానం ఉపదేశించగల సమర్ధుడని, గీతలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పాడు. 
బాబా : నానా! శ్లోకము యొక్క తాత్పర్యము అక్కరలేదు.ప్రతిపదార్ధము,అంతరుద్బోధ ఏమిటి?పరమార్ధం ఏది?  చెప్పుము.

అప్పుడు నానా ప్రతి పదమునకు అర్ధము చెప్పెను.

 బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో చాలునా? 
నానా : ప్రణిపాత అను పదమున కింకొక అర్ధము నాకు తెలియదు.సాష్టాంగనమస్కారమని నాకు తెలియును.
బాబా : పరిప్రశ్న అనగా నేమి?
 నానా : ప్రశ్నలడుగుట.
బాబా : ప్రశ్న యనగా నేమి?
నానా : అదే, అనగా ప్రశ్నించుట.
బాబా : పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను  ఒక్కటి అయినచో, వ్యాసుడు ' పరి 'యను ప్రత్యమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివిహీనుడా?
నానా : పరిప్రశ్నయను మాటకు నాకితరయర్ధమేమియు తెలియదు.
బాబా : సేవ యనగా నెట్టిది?
నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది.
బాబా : అట్టి సేవ చేసిన చాలునా?
నానా : సేవ అను పదమున కింకను వేరే యర్ధమేమి గలదో నాకు తోచుట లేదు.
బాబా : రెండవ పంక్తిలోని "ఉపదేక్ష్యంతి తే జ్ఞానం" అనుదానిలో జ్ఞానమను పదముపయోగించకుండ ఇంకొకపదము ఉపయోగించగలవా?
నానా : అవును.
బాబా : ఏ పదము?
నానా : అజ్ఞానము.
బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో,ఈ శ్లోకములో నేమైనా  అర్ధము గలదా?
నానా : లేదు;శంకరభాష్య మావిధముగా చెప్పుట లేదు.
బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము.అజ్ఞానము అనుపదము నుపయోగించిన యెడల తగిన యర్ధము వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైనా ఆక్షేపణ కలదా?
నానా : అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్ధమును విశదపరచుట నాకు తెలియదు.
 బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ-చేయుమని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా! 
నానా : అవును. అతడు తత్వదర్శియే, కాని అర్జునునితరజ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు.
బాబా : నీకది బోధపడలేదా?
(నానా సిగ్గుపడెను. అతనిలో అహంకారము నశించింది.అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను.)

తదుపరి బాబాగారు చేసిన జ్ఞానబోధ..సశేషం

 సర్వం శ్రీ సాయినధార్పణ మస్తు 












Tuesday, September 30, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం -70

ఓం శ్రీ హృదయ నివాసాయ నమ:

"సాయిబాబాగారి అవతార లక్ష్యం - హిందూ,ముస్లిములు ఐకమత్యంగా అన్నదమ్ములవలె

జీవించాలని,వారు ఏకాత్ములని బాబా నిశ్చితాభిమతం."

బ్రహ్మం అన్నా,ఈశ్వరుడన్నా, అల్లాహ్ అన్నా ఒక్కటేనన్నాడు. 

మనిషి మంచితనానికి,ఆధ్యాత్మికతకు,పవిత్ర జీవనానికి మతం అవరోధం కాదన్నది బాబా అభిమతం.


 బాబాగారు సశరీరులుగా ఉన్న ఆ రోజుల్లో, మరియు మా గృహమునందు సాయి మహత్యములు
 చూసిన ఈ రోజుల్లోనూభక్తులకు సరైన అవగాహన లేక అడిగే ఒక ప్రశ్న.. బాబాకి తెలుగు వచ్చా?
 అని కొందరు మా ఇంట్లో బాబాగారి అక్షరమాలను చూసి అడిగారు. మేము వారి ప్రశ్నకు
 నవ్వుతూ శ్రీ సాయిబాబాను మీరు సామాన్య వ్యక్తిగా తీసుకుని ఇలా ప్రశ్నిస్తున్నారు. 
 అవతార పురుషుడు అంటేనే భగవంతుని మానుష రూపం కదా! వారికి లేని 
పాండిత్యం, రాని భాషలు ఉంటాయా..ఆయన దివ్యాంశ సంభూతుడు.కారణజన్ముడు. 
"వారు ఫకీరు వేషధారణులు ,మసీదు నివాసం, అల్లాహ్ మాలిక్ స్మరణ. "కాబట్టి ఆయనకు 
ఇతర భాషలు రావు అని కొంతమంది అభిప్రాయం. శ్రీ సాయికి ఖురాన్ పైన ఎంత అవగాహన
 ఉందో, భగవద్గీత పైన అంత సాధికారత ఉంది. 

 బాబాగారు నానాసాహెబ్ చందోర్కరుగారి అహంకారమును తొలగించి 'శిష్యుడైనవాడు గురువుకు మనసా,వాచా,కర్మణా సర్వసమర్పణ కావాలీ' అని భగవద్గీత శ్లోకంతో  జ్ఞానబోధ ఏవిధంగా చేసారో చెప్పేముందు  
ఒక చిన్న ఉదంతం.  


శ్రీసాయి మహత్యాలు అనంతములు. వారి లీలలలో భాగంగా ఒకరి ఇంట్లో సాయి ఊదీ రూపధారుడుగా వెలిసారు. వారి గురించి సవివరంగా మరొక టపాలో వ్రాస్తాను. వారి ఇంటికి భక్తులు సమస్యలతో వచ్చేవారు.వారింట్లో ఆ మాత(పేరు గోప్యం)ద్వారా సాయి భక్తుల కష్టాలకు పరిష్కారాలు చూపేవారు. అర్ధరాత్రి కూడా కొందరు సమస్యలతో వచ్చుట వారి కుటుంబానికి అసౌకర్యంగా అనిపించి బాబాను వేడు కొని కలకత్తా బదిలీ పెట్టుకొని ఇల్లు తాళం పెట్టుకొని కలకత్తా వెళ్ళిపోయారుట. హమ్మయ్య! ఇక్కడ తెలుగువారు లేరు అందరూ బెంగాలి కదా ఆ భాష నాకు రాదు కాబట్టి భక్తుల తాకిడి ఉండదు అనుకొన్నారుట. ఆ స్వామి వచ్చిందే భక్తుల బాధలు తీర్చడానికి. అక్కడ కూడా వీరింట్లో మహత్యాలు తెలిసి జనులు వచ్చేవారట. ఆవిడకి తెలియకుండానే బెగాలీలో వారికి సమాధానాలు చెప్పేవారట. రాను,రాను ఆవిడకి అర్ధమైందేమిటంటే  ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఏ భాషైనా నా ప్రమేయం లేకుండా బాబా మాట్లాడిస్తారు. ఆయన నాద్వారా చేయాలనుకున్నది ఎక్కడున్నా చేస్తారు అని ఆ సద్గురు లీలలను తెలుసుకొని మరల వారు వారి సొంత ఇంటికి వచ్చారుట. ఆవిడ అంటారూ "వారిముందు మనమెంత సాయీ" అందరినీ ఆవిడ సాయీ అని పిలుస్తారు. వారు అనగా శ్రీసాయి భగవానుడు.  

తదుపరి భగవద్గీత శ్లోక వివరణ..   సశెషం 


సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు.    

    

  

   

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 69

ఓం శ్రీ సర్వాధారాయ నమ:

శ్లో"  పరీత్య భూతాని పరీత్య లోకాన్

       పరీత్య సర్వా: ప్రదిశో దిశశ్చ/

      ఉపస్థాయ ప్రధమజామృతస్యాత్మ

      నాత్మాన మభి సం వివేశ//


భా:-    ఆకాశాది పంచభూతములందు, సూర్యాదిలోకాలలోనూ, పూర్వాది నాలుగు దిక్కులందు ఆగ్నేయాది దిక్కోణములందును పరమాత్మ నిరంతరం వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువణులో అంతర్యామి రూపంలో నిండి ఉన్నాడు.ఆ భగవంతునిలోనే సృష్టి రహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ పరమానంద మంగళరూపుడే అమృతస్వరూపుడు. అతడే మోక్షప్రదాత.


శ్రీ సాయి సగుణబ్రహ్మ స్వరూపుడు 

 భగవంతుడు నిర్గుణుడు, సగుణుడు. 

భగవంతుడు అవతారానికి రాకముందు నిర్గుణుడు.ఏ రూపం ధరించినా సగుణుడు.

రెండూ బ్రహ్మమే అయినా ఒకటి సగుణబ్రహ్మ,రెండవది నిర్గుణబ్రహ్మ.

సగుణబ్రహ్మస్వరూపము పూజ్యనీయము.

నిర్గుణబ్రహ్మస్వరూపము నిర్గుణోపాసన అనగా మనమునందు ( పరమాత్మ సమీపాన కూర్చొని ) ధ్యానించుట . 

సాయి అవతారం సగుణం. సాయితత్వం సగుణ బ్రహ్మతత్వం. 

అరూపారాధన నిర్గుణం. కాని మనస్సు రూపాన్ని కోరుతుంది. ఒక రూపం కోసం మనస్సు ఆరాటపడుతుంది. భగవంతుడు ఒక్కడే అంటూనే ఇన్ని రూపాలు కల్పించడం మనిషి బలహీనత. విగ్రహంలో సాయిని చూడడం సాయి వెనుక రహస్యం,మనస్సును దాటితే కదా హృదయంలో ప్రవేశం!హృదయంలో చివరన ఆత్మ కదలాడుతుంది. సగుణ,నిర్గుణ తత్వాలు సామాన్యులకు అర్ధమయ్యేవి కాదు.


సగుణుడు,నిర్గుణుడుకూడాసద్గురువే.సద్గురువులోరెండుఅంశాలూఉంటాయి. ఎవరు ఏది కోరితే అదే లభిస్తుంది.ఎవరికి ఏది అవసరమో దానినే పొందగలరు.

సాయిబాబా భగవంతుడా! భక్తుడా! అవతారపురుషుడా! ఎవరు ఎలా అనుకున్నా సాయి కాదనరు. బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము జూపేవారుకాదు.అట్టి ఒక ఉదంతము:- 

 డాక్టర్ పండిట్ అనే ఆయన తాత్యానూల్కర్ కు మిత్రుడు.బాబా దర్శనం కోసం ఒకసారి షిర్డీ వచ్చాడు. సాయిని దర్శించి కొంచెంసేపు మశీదులో కూర్చున్నాడు. కేల్కర్ అతనికి మర్యాద చేసి ఆతిధ్యమిచ్చాడు.పూజ వేళకు దాదాబూటీ మసీదుకు బయలుదేరాడు. ఆయనతో డా. పండిట్ కలిసి బయలుదేరాడు. దాదాబూటీ సాయికి పాదపూజ చేసాడు. బాబాకు చందనం పూయుటకు ఎవరికి ధైర్యము ఉండేది కాదు.మహల్సాపతి బాబా కంఠమునకు చందనం పూసేవారు. అతనికి బాబాపైన భక్తి ఎంతో చనువు  అంతే ఎక్కువ.ఆ సమయములో మహల్సాపతి మసీదులో లేరు. డా.పండిట్ దాదా చేతిలోని చందనమును తీసుకుని బాబా నుదిటిపైన త్రిపుండ్రాకారముగ వ్రాసెను.అందరూభయభ్రాంతులైనారు.కానీబాబా కిమ్మనలేదు. ఆరోజు సాయంత్రం దాదాబట్ సాయిని ప్రశ్నించాడు భయం భయంగా.

బాబా! మీరు ఎవరినీ గంధం పూయడానికి అనుమతించరు గదా! పండిట్ అంత చనువుగా మీ నుదుట మూడు రేఖలు పెట్టుటకు ఏల ఒప్పుకున్నారు?

బాబా నవ్వి అన్నారు: "ఏం చేయను, పండిట్ నాలో తన గురువును చూచుకున్నాడు.తన గురువును తాను సేవించుకుంటే నేనెలా కాదనగలను చెప్పు?"ఆతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది." దాదాభట్ ఆ తరువాత పండిట్ ని ప్రశ్నించగా అతడు, బాబాను తన గురువు 'కాకా పురాణిక్' గా భావించి తన గురువునకొనరించినట్లు బాబా నుదిటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను.

భక్తుల అభీష్టం నెరవేర్చడం బాబాకు ఎంతో ఇష్టం వారు సభక్తికంగా ఎలా పూజించినా ఆమోదిస్తారు.స్వీకరిస్తారు.

సాయిబాబా మరియొక భక్తుని ఎట్లు ఆశీర్వదించెనో తదుపరి...సాయి సత్యవ్రత మహిమ ...టపాలో...సశేషం 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 





Sunday, September 28, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 68

ఓం శ్రీ సర్వ లోక రక్షకాయ నమో నమ:

శ్లో:క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత /

  క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ// 

భా:- ఓభరతవంశీయుడా! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానము.నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను."ప్రతిదేహము నందును నేను క్షేత్రజ్ఞుడనై యుందును." 


శ్రీ సాయిబాబా సర్వాంతర్యామిత్వము;  అద్భుతము 


శ్రీసాయి అవతారము విశిష్టమైనది; అద్భుతమైనది.

నా పూర్వజన్మ సుకృతముచే వారి చరణశరణ భాగ్యము లభించినది. 

వారిసన్నిధిలో,స్మరణలోనాకుకలిగినఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. 

సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు.

ఎవరువారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. 

సన్యాసులు,సాధకులు,ముముక్షువులు తదితరులనేకమంది బాబా వద్దకు వచ్చేవారు.బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించేవారు.వారు ఎల్లప్పుడూ 'అల్లామాలిక్'  అని  అనెడివారు.ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంతతత్వమును బోధించుచుండువారు. 

భక్తుల అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా యెరింగెడివారు.సర్వజ్ఞులైనప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్న వారికేమాత్రము ఇష్టము లేదు. వారి నైజమట్టిది.

మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడే!వారిని జూచిన భక్త జనసందోహం షిర్డీలో వెలసిన భగవంతుడని అనుకొనుచుండిరి. 


1910 సం" దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి, నిశ్చలముగ యుండిపోయిరి.మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును,మాధవరావు దేశపాండే దీనిని జూచి, వెంఠనే బాబావైపు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను." దేవా! ఇట్లేల చేసితిర"ని బాబా నడిగిరి.బాబా బాహ్యస్మృతి త్తెచ్చుకొని, "ఇక్కడకు చాలాదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని,కొలిమినూదుచుండెను.అంతలో ఆమె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుతున్న కొలిమిలో బడెను. వెంఠనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని.నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు.కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని జవాబిచ్చెను.ఇలా భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు.




భక్తులయందు అవిచ్చిన్నమైన పరిపూర్ణప్రేమానురాగాలను కలిగి యుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని,దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. 

సాయిబాబాయొక్కదివ్యస్వరూపముఅట్టిది.ఆద్యంతములులేనట్టిది,అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది,విశ్వమంతయు నావరించినట్టిది యైన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా యవతరించినది.

ఎంతో పుణ్యము చేసుకొన్న అదృష్టవంతులు మాత్రమే యా నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి.సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక, వారినొక సామాన్యమానవునిగా నెంచినవారు నిజముగ దురదృష్టవంతులు. 

శ్రీసాయి సగుణ బ్రహ్మ స్వరూపము -  సాయిసత్యవ్రత మహిమను గూర్చి తదుపరి అధ్యాయములో... సశేషం....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 



Saturday, September 27, 2014 2 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం _ 67

ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాధాయ నమ:


శ్లో" మధులుబ్ధౌ యధాభృంగ: పుష్పాత్ పుష్పంతరం వ్రజేత్!

  జ్ఞానలుబ్ధ స్తధాశిష్యో గురోర్గుర్వంతం వ్రజేత్!! 



మధువునందు ప్రీతిగల తేనెటీగ పుష్పము నుండి పుష్పమునకు తిరిగి మధువును సంపాదించినట్లు, ముముక్షువైన శిష్యుడు పలువురు గురువులను దర్శించి, వారినుండి జ్ఞానమును సంపాదింపవలెను.

శ్రీమధ్భాగవతంలో అవధూత తాను 24 మంది గురువులనుండి జ్ఞానమార్జించినట్లు చెబుతారు.

భగవాన్ శ్రీరమణ మహర్షి వంటి ఆత్మవేత్తలు, మహనీయుల సందర్శన సేవా - సాంగత్యములెంతో శక్తివంతములైనవనీ,పవిత్రమైనవనీ చెప్పారు.

శ్రీ సాయినాధుని గురువు కూడా మొదట అడవిలో వారికి కనిపించి "భగవంతుని కృపలేక ఎవ్వరూ మా వంటివారిని మార్గంలో కలవలేరు" అంటారు.

దేవ, గురు, ప్రాజ్ఞ దర్శన సేవనాదులు ముముక్షువుకు ఆవశ్యమని శ్రీమద్భగవద్గీత చెబుతుంది.

గురుకరస్పర్శ ప్రభావము 

సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును.

సద్గురువనగానే నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్లనుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది.

ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును; అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మికసంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడా నెమ్మది పొందును.

శ్రీసాయి సుందరరూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును;కన్నులనుండి ఆనందాశ్రువులు పొంగిపొరలును;హృదయము భావోద్రేకముతోయుక్కిరిబిక్కిరియగును.'నేనేతాన'ను(పరబ్రహ్మస్వరూపమను) స్ఫురణ మేల్కొని,ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును.'నేనునీవు ' అను బేధభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. 

తదుపరి అధ్యాయములో శ్రీ సాయి అంతర్యామిత్వము..అద్భుతములను తెలుసుకుందాము.       సశేషం...

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Friday, September 26, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 66

ఓం శ్రీ ముకుందాయ నమ:



భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే

దివి స్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే

నవ నరకంబుల నలగెడినాడు నటనల బాయడితడొకడే

ఇవలనవల హృదయేశుడు విష్ణుడుఈతని మరువకుమీ జీవాత్మా..



భా: -  'సంసార సాగరంలోనే కాదు, స్వర్గనరకాల్లో,పూర్తిగా ఇహపరాల్లో మనకు దిక్కైనవాడు ఆ భగవంతుడు ఒక్కడే!అలాంటి హృదయేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును విస్మరించవద్దు.'


శ్రీ సాయిబాబాగారి అమృతతుల్యమైన పలుకులు:- 

ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దు:ఖబంధనములనుండి తప్పింతును.' ప్రాపంచిక విషయములను మరచి,నా లీలలను,చరిత్రమును మననము చేయుచు,ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనుడు.

మన:పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును.' సాయి  సాయీ యను నామమును జ్ఞప్తియందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును. 

"మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. "

నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయాలలో నివసించువాడను.నేను చరాచరజీవకోటి నావరించియున్నాను.

 ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే.

నేనే జగన్మాతను,త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే,సృష్టిస్థితిలయకారకుడను నేనే.

 ఎవరయితే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు.నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు,చీమలు తదితర దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే,నా రూపమే!"

"నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తి శ్రద్ధలతో మన:పూర్వకంగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను జూచెదను.ప్రపంచములోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము." 

తదుపరి అధ్యాయములో 'గురుకరస్పర్శ   'ప్రభావము....          -సశేషం...


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.



Thursday, September 25, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 65

ఓం శ్రీ సద్గురవే నమో నమ:

మం"  శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య:

       శృణ్వంతో2పి బహవో యం న విద్యు:!

     ఆశ్చర్యో వక్తా కుశలో2 స్య లబ్ధా

       ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్ట:!!


భా:- దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో, 

విన్నప్పటికీ ఎందరో దేనిని అర్ధం చేసుకోలేరో, 

ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు,

వినేవాడూ అరుదు.అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను 

పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.




శ్రీ సాయిబాబా జీవితచరిత్ర సముద్రము వలె విశాలమైనది.లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి,జ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును.

వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రభోదములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంచించునవి, అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు.

భక్తులకు బాబా లీలలు మిక్కిలి ఆనందం కలుగజేయును.శ్రీ సాయినాధుని దర్శనభాగ్యమున మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల  బలము తగ్గును.ప్రపంచమంతయు సాయిబాబా రూపమే వహించెను.

వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా! అను వివాదము వదలి పరమార్ధము నిజముగా గురుబోధలవల్లనే కలుగుననియు, రామకృష్ణులు తమ గురువులయిన వసిష్ఠసాందీపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరి. దానికి దృఢమైన నమ్మకము(నిష్ఠ), ఓపిక(సబూరీ) అను రెండు గుణములు ఆవశ్యకము అని శ్రీ సద్గురువు మనకు సచ్చరిత్రము ద్వారా  ఉపదేశిస్తున్నారు. 

మూడవ అధ్యాయములో శ్రీ సాయి అమృతతుల్యమగు పలుకులను తదుపరి టపాలో ...సశేషం .

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.








శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 64

                      ఓం శ్రీనారాయణాయ నమో నమ: 


మం"   ఇంధ్రియేభ్య: పరా హ్యర్ధా అర్ధేభ్యశ్చ పరం మన:!

       మనసస్తు పరా బుద్ధి: బుద్ధేరాత్మా మహాన్ పర:!!



భా:- ఇంద్రియాలకన్నా విషయ వస్తువులు శక్తి మంతమైనవి.

      విషయ వస్తువులకన్నా మనస్సు శక్తి మంతమైనది. 

     మనస్సుకన్నా బుద్ధి శక్తి మంతమైనది. 

    బుద్ధికన్నా మహత్వం సంతరించుకొన్నదైన ఆత్మ శక్తి మంతమైనది.


మం"   మహత: పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష: పర:!

      పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతి:!!


భా:- మహత్వం గలదైన ఆత్మకన్నా అవ్యక్తం శక్తిమంతమైనది. 

       అవ్యక్తం అంటే భగవంతుని శక్తి. 

     ఏది ఈ ప్రపంచాన్నే ఉద్భవించి కార్యకలాపాలు సాగిస్తున్నదో ఆ శక్తి.

     ఆ శక్తీ భగవంతుడైన స్థానం లేకుండా పనిచేయలేదు. కనుక 

    అవ్యక్తంకన్నా భగవంతుడు శక్తిమంతుడు.

    భగవంతునికన్నా శక్తిమంతమైనది ఏదీ లేదు. 

   ఆయనే పరమ వస్తువు. ఆయనే చరమ గమ్యం.  

 అటువంటి శక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన శ్రీ సాయినాధుని అవతార మహత్యమును,శ్రీ సాయి సచ్చరిత్రము ద్వారా ఒకసారి శ్రీ సాయిని దర్శించగలరు!


మొదటి అధ్యాయములో శ్రీ సాయి వేదాంత తత్వము:- 

శ్రీ సాయిబాబా శిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండిరి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు. భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి.తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ; మీది రాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. 

జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలయును.అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.   

కబీరుకధ:- 

ఒకనాడు ఒక స్త్రీ తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూసి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. "నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా? దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను. 

"భయము లేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవునూ అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము.నీవు తప్పక రక్షింపబడెదవు.   

 రెండవ అధ్యాయములో శ్రీ సాయి యోగీశ్వరునిసచ్చరిత్రము మనకు సత్యమును, ఆధ్యాత్మిక మార్గమును తెలుపును. ఈ వివరణ తదుపరి టపాలో....సశేషం. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.  

   







 య నమ: 
Friday, July 18, 2014 2 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీ సాయి సేవా సత్సంగం _63

ఓం శ్రీ గురుభ్యో నమో నమ:





    సర్వదా సర్వభావేన నిశ్చింతై: భగవానేవ భజనీయ:

'సమస్త చింతలను మరచి, సదా సమస్త పరిస్థితుల యందును పరమాత్మనే సేవించాలి.' 


 కలియుగంలో మన జీవితాల్ని ఉద్ధరించే ఏకైక మార్గం భక్తియోగంలో అంతర్భాగమైన పురాణగ్రంధ పఠనం, శ్రవణమే! 

  అలసులు, అల్పాయుష్కులు,మందబుద్ధియుతులు,మందభాగ్యులు,నానారోగపీడితులు అయిన ఆధునిక మానవులకు ఆనందం అతి దుర్లభం. పూర్వ యుగాల్లా మనం తపస్సులు,యాగాలు చేయలేం. కేవలం భగవన్నామ స్మరణమే శరణ్యం. మన నిస్సహాయస్థితిని ముందే ఊహించి సులువైన తోవను నిర్దేశిస్తూ, తన కధాగానంతో తరించమన్నాడు భగవానుడు.

జూన్ 17వ తేదీ మంగళవారం శ్రీ సాయినాధుడు "కలియుగంలో మొదటి అద్భుతం, పాపాలు అంతరించే మార్గం" అని వివరిస్తూ 2010లో జూన్ 17న మా శ్రీవారి మీద శ్రీ చక్రరూపంలో సర్వదైవాలను ఇష్టదైవాలను సందర్శించుకునే సాక్షాత్కార ఆత్మదర్శనం ఇచ్చిన రోజు. 5వ సంవత్సరంలో మరల స్వామిని స్మరిస్తూ..మరియు తిధుల ప్రకారం మా గృహము నందు "స్వయంభూగా స్వామి అర్చావతార పాలరాతిమూర్తిగా" , ఆవిర్భవించిన రోజు కూడా... రెండూ కలిసివచ్చి బహు విశేషమైన రోజు కావున మా కుటుంబ సభ్యులం మా గృహమున శ్రీ హనుమాన్ చాలీసా 108 సార్లు సంకీర్తన చేయుటకు నిశ్చయించుకుని భక్తులను, సత్సంగ సభ్యులను ఆహ్వానించినాము. 

ఆరోజు స్వామికి అభిషేక, పూజలను చేసుకొని, వారి సోదరులైన ఆంజనేయస్వామికి కూడా అభిషేక, పూజలొనరించిన తదుపరి , భక్తితో  భక్తులందరమూ హనుమాన్ చాలీసాను మనసారా 108 సార్లు భజనబృందం వారితో సమంగా సంకీర్తన చేసాము. 

భక్తులకు శ్రవణము,కీర్తనములు ప్రియములు. భగవంతుని అనంత కళ్యాణ గుణములను పరవశించి ప్రవచించడం కధా శ్రవణం. భగవంతుని అనంత కళ్యాణ గుణములను మైమరచి గానం చేయడం కీర్తనము.

విషయ ప్రపంచంలో జీవితమును కొనసాగించు చున్ననూ ఎవరి మనస్సు భగవద్గుణ శ్రవణ కీర్తనాదుల యందు రమిస్తూ ఉంతుందో వారే ధన్యులు.

రాగద్వేషాలను ప్రక్కకు నెట్టి ధర్మాన్ని అర్చనగా మార్చుకొనే పుణ్యాత్ములు కర్మయోగులై అంత:కరణ శుద్ధిని పొందుతారు. అట్టి నిర్మల చిత్తముతో శాస్త్రమును శ్రవణం చేసి ఆత్మ విదులై తరిస్తారు.

శ్రీ సాయినాధుని ఆశీర్వాదముతో భక్తులంతా ఉ"  9గం"లకు ప్రారంభించిన హనుమాన్ చాలీసాను భజనద్వారా భక్తితో,ఆరతి తాంబూలాలతో ఆంజనేయస్వామిని 108సార్లు అర్చించి, తదుపరి సాయీనామ సంకీర్తనలతో పరవశించి, సాయి చాలీసాతో కీర్తనలను ముగించి,తీర్ధ,ప్రసాదములు మరియు విందు స్వీకరించి భక్తులు శ్రీ సాయినాధ,హనుమాన్ జీ లకు ప్రణమిల్లి వారీఅశీర్వాదములు అందుకొని ధన్యులైనారు.  

జూలై 12 శనివారం గురుపౌర్ణమి  సందర్భంగా మేము అభిషేకం,అర్చనల తదుపరి శ్రీ సాయి సత్యవ్రతం మా గృహమునందు భక్తి,శ్రద్ధలతో జరుపుకున్నాం. పిలిచిన భక్తులంతా 11.30 ని"లకు ఒక్కొక్కరుగా వచ్చుచున్నారు. కానీ స్వామికి అభిషేక,అర్చనలు అయిన తరువాత నేను పట్టుచీర కట్టుకొని వ్రతమునకు  వచ్చుసరికి ఇద్దరు అమ్మాయిలు (10,12ఏళ్ళ ప్రాయము గల) భక్తితో కూర్చొని ఉన్నారు. అందులో పెద్దామ్మాయి నన్ను చూసి నవ్వుతోంది పలకరింపుగా. నాకు మనసులో తెలియని ఆనందం.ఎవరీ పిల్లలు అని మావారిని అడగగా వారు వేణుసాయినాధ్ అని మనింటికి వచ్చారే సాయిభక్తులు. వారి పిల్లలు వారి శ్రీమతి కూడా వచ్చారు అని చెప్పారు. వ్రతం మొదటినుండి ఐదు కధలు పూర్తి అయ్యేవరకు ఆ అమ్మాయి అత్యంత శ్రద్ధతో భక్తితో అన్నీ ఆలకించింది. తీర్ధ ప్రసాదాలను స్వీకరించిన  తదుపరి ఆపాప ప్రత్యేకంగా మా వారి వద్దకు వచ్చి "ఊదీ ఇస్తారా!" అని అడిగి తీసుకుందిట. వారి కుటుంబం బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మగారికి తాంబూలం ఇస్తూ చిన్నపాపకు ఒక పండు చేతిలో పెట్టి గుమ్మం వైపు చూడగా, అక్కడ పెద్దపాప నవ్వుతూ నన్ను చూస్తోంది.కళ్ళతో రమ్మని పిలిచాను. జామపండు ఇవ్వనా అని అడిగాను. తలూపింది.నేను ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయారు. మా భోజనాలు అవగానే, మావారు ఈరోజు బాబాగారు ఎవరి రూపంలో మనమధ్య ఉన్నారో తెలుసా! అన్నారు. వేణు సాయినాధ్ పెద్దపాప రూపంలో అనిచెప్పారు.మా అందరికీ తన్మయత్వంతో వైబేషన్స్.స్వామి ఆవిధంగా దగ్గరుండి పంచమ గురుపౌర్ణమి భక్తి శ్రద్ధ్లలతో మాచే చేయించారు. 

"సాయినామ స్మరణములో బ్రతుకును సాగించిన వారి జీవితము భవ్యంగా,దివ్యంగా శోభిస్తుంది.  విస్మరణమెరుగని స్మరణ బ్రతుకును పావనం చేస్తుంది. ప్రారబ్ధము యొక్క బరువు ఎక్కువై, పురుషార్ధము తేలికపడుతున్న సందర్భాలలో భక్తి పూర్వకంగా పరమాత్మను పిలవాలి. ప్రేమిస్తూ పిలవాలి. ప్రేమ పలుకులకు పరమాత్మ స్పందిస్తాడు. అవరోధాలను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తాడు. ప్రతిబంధకములను దూరం చేసి తనకు దగ్గరగా తీసుకుంటాడు."      


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు        
Wednesday, July 9, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీ సాయి సేవా సత్సంగం-62

                  శ్రీరస్తు                           శుభమస్తు                         అవిఘ్నమస్తు

ఆహ్వాన పత్రిక

 ఓ౦ శ్రీ గురుమూర్తయే నమ:

 శ్లో”  శుక్లా౦ భరధర౦ విష్ణు౦ శశివర్ణ౦ చతుర్భుజ౦!
     ప్రసన్నవదన౦ ధ్యాయేత్ సర్వవిఘ్నోప శా౦తయే॒॒!!

 శ్లో” గురూణా౦ వ౦దన౦ శ్రేష్ఠ౦, గురుణామర్చన౦ తధా!
    గురూణా౦ స్మరణ౦ నిత్య౦ తస్మైశ్రీ గురవేనమ:
        గురుచరణారవి౦దాభ్యా౦ నమో నమ:!!

నాయ౦దెవరి దృష్టి కలదో, వారియ౦దే నా కటాక్షము కలదు. – బాబా

స్వస్తిశ్రీ చా౦ద్రమాన శ్రీ జయ నామ స౦వత్సర౦ ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా “గురుపౌర్ణమి” పర్వదినాన్ని పురస్కరి౦చుకొని తేది:  12-07-2014  శనివార౦ మా గృహమున౦దు శ్రీ షిర్డీసాయి పూజ, అభిషేక౦, సాయి సత్యవ్రత౦ మరియు  సాయినామ స్మరణ  చేయ నిశ్చయి౦చాము. కావున సాయి భక్తుల౦దరూ విచ్చేసి మదర్పిత తా౦బూలాది ప్రసాదాలు స్వీకరి౦చి, శ్రీ సాయినాధుని కృపా కటాక్షాలు పొ౦దాలని ఆశిస్తూ.....ఈ శుభస౦కల్ప౦ మాకు కలుగజేసి, స్వయ౦భూగా మా ఇ౦ట వెలసిన షిర్డీబాబావారికి వారి ఆదేశానుసార౦ గుడి, సేవాశ్రమ౦ కట్టుటకు నిర్ణయి౦చాము. మా ఈ శుభ స౦కల్పాన్ని భక్తుల౦తా విజయవ౦త౦ చేయాలని మా హృదయ పూర్వక విన్నప౦. భక్తుల౦దరికీ ఇదే మా  హృదయ పూర్వక ఆహ్వాన౦.

                                                       జై శ్రీ సాయిరా౦                                                              
సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు 
          
                         శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦  - నిర్వాహకులు  
                                                                  SRI N. SURYA  PRAKASH